శ్రీగంగ సాహిత్యం
బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్, కూలాల కిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటే, సత్కవుల్ హాలికులైన నేమి గహనాంతర సీమల కంద మూలకౌద్దాలికులైన నేమి, నిజ దార సుతోదర పోషనార్ధమై - బమ్మెర పోతన
Tuesday, August 28, 2012
Saturday, August 25, 2012
బినామి
నేను వెళ్తున్న ఎ.సి కారు ఏమాత్రం శబ్దం చేయకుండా వేగంగా ముందుకు వెళ్తుంది.అక్క ఆరోగ్యం పాడైందని ప్రసాద్ ఫోను చేయడంతో హడావిడిగా బయలు దేరాను.మామూలు పరిస్థితి అయితే అంత హడావిడిగా బయలు దేరేవాడిని కాను, కానీ అక్క నాతో మాట్లాడాలి అన్నదని ప్రసాద్ చెప్పాడు. ఏ విషయమో ఎవరికీ చెప్పకూడదు అన్నదట. ఆ మాట వినగానే ఆందోళన మొదలైంది నాకు.
కొపదీసి నేను వెల్లేలోగా ఏమైనా అయితే?..చ.చ అలా కాదు. నేను వెళ్ళేవరకూ అక్కకి ఏమి కాదు.బాగావంతుడా నిన్నెప్పుడూ ఏమి అడగలేదు ఇప్పుడు నాకు అన్యాయం చేయకు. కలదో, లేడో తెలీని ఆ భగవంతుని మనసులో ప్రార్దించాను.కారు ముందుకు పోతూ ఉంటె నా ఆలోచనలు వెనక్కి వెళ్తున్నాయి.
అక్క నేను,ప్రసాద్ మా అమ్మా నాన్నలకు గుర్తుగా ఉన్నాము.
మా చిన్నప్పుడే నాన్న పోయారు. తన తమ్ముడికి కూతుర్నిచ్చి చేసిన ఏడాదికి అమ్మ కూడా పోయింది. వెళ్తూ వెళ్తూ మా భాద్యత అక్క, బావలకి అప్పజెప్పింది.
అక్క మమ్మల్ని తన సంతానంగా భావెంచేది. ఎవరైనా మీకు పిల్లలు లేరా అని అడిగితే ఏం వీళ్ళు నా పిల్లలు కారా అనేది.
నేను మా అక్క పోలిక, తెల్లగా ఉంటాను నొక్కుల జుట్టుఅందగాదికిందే లెక్క.తమ్ముడు నాన్న పోలిక నల్లగా తుమ్మమోద్దులా ఉంటాడు.కళ్ళు ఉబ్బి ఉంటాయి. ముఖం మీద స్పోటకపు మచ్చలూ చిన్నపిల్లలు చూస్తె దడుసుకొనేలా ఉంటాడు.
కాని దేవుడు వాడికి మంచి గాత్రం ఇచ్చాడు. ఒక గాత్రం బాగాలేక పోతే దేవుడు ఇంకోటి ఇస్తాడట అది వాడే చెప్పాడు. గాత్రం అంటే శరీరం అని కూడా వేదే చెప్పాడు.
వాడిని చూసి పారిపోయే పిల్లలు కూడా వాడి చేత పాటలు పాడించుకొని వింటారు. అందుకేనేమో వాడికి పిల్లల మద్య ఉండేలా టీచర్ ఉద్యోగమే వచ్చింది.
నేను చిన్నప్పటినుండీ స్కూల్ పస్ట్, అక్కా బావా నన్ను కస్టపడి ఇంజనీరింగ్ చదివించారు. నేనుకూడా కస్టపడి చదివేవాడిని. మా ఊరి వాళ్ళంతా నేను ఐ.ఎ ఎస్ కి ఎంపిక అయినప్పుడు చాలా సంతోషించారు. అక్క కి ఎంత సంతోషమో.
నాకు పెళ్లి సంబంధాలు తెచ్చింది అక్క. కాని అవి నా అందానికి గానీ, నా స్టేటస్కి గానీ ఏమాత్రం సరిపోవు. ఆమె మనసు నొప్పించటం ఇష్టం లేక ట్రైనింగ్ తర్వాత చూద్దాంలే అన్నాను.అయినా ఊళ్ళో అమ్మాయిని చేసుకోవటానికి నేనేమన్నా ప్రసాదునా.
ట్త్రైనింగ్ అయ్యి నాకు మా జిల్లాలోనే సబ్కలక్టర్ పోస్ట్ వచ్చినపుడు, మా సిట్టింగ్ యం.యల్.ఎ కూతుర్ని ఇస్తామన్నా నేను మా కమీషనర్ కూతుర్నే చేసుకున్నా.తను డాక్టర్ సన్నజాజి మొగ్గలా ఉంటుంది.పెళ్ళికి అక్క,బావా వచ్చారు.ప్రసాద్ తీసుకొని వచ్చాడు పెళ్ళిలో మర్యాదలు జరగకున్నా వాళ్ళు పట్టించుకోలేదు. నాకు ఎక్కువసేపు మాట్లాడటానికి కుదరలేదు. వాళ్ళు ఎప్పుడెల్లారో నాకూ తెలీదు.
కొన్నాళ్ళకు అక్క ప్రసాద్ పెళ్లికి పిలిచింది నాకు నవ్వొచ్చింది వాడికి ఎవరిస్తున్నారా పిల్లని అని, ఏదో గంతాటు తగ్గ బొంతలా మా ఊరి పిల్లే ఆపిల్లకి కాలు పోలియోతో వంకర.
వాడి పెళ్లి తర్వాతా బావపోయాడు నేను వెళ్లి వచ్చాను. ఇక ప్రసాద్ అక్క ఇంట్లోనే మకాం పెట్ట్టాడు.వాడికదే మంచిది లేకుంటే వాడికొచ్చే జీతానికి వేరే ఎలా బ్రతగ్గలడు.
ప్రసాద్కి ఇద్దరూ ఆడపిల్లలే నాకిద్దరూ ఆడపిల్లలు. నా పోస్టింగులు నా అదృష్టం కొద్దో మా మామగారి పరపతి వల్లనో సంపాదనకు అనుకూలంగా ఉండేవి.
రోజులు గడిచేకొద్దీ నాకు ఓ విషయం అనుబవానికి వచ్చింది.సంపాదించటం కంటే దాన్ని దాచటం కష్టం. మామగారి సలహాతో అక్క సాయంతో అక్క పేరుమీద చాలా ప్రాపర్టీస్ కొన్నాను. అంటే ఆమె నాకు బినామీ అన్నమాట. ప్రసాద్ పిల్లల్ని బాగా చదివిస్తున్నాడని తెలిసింది. అయినా చాలీ చాలని జీతాలతో వీళ్ళకి ఈ కోరికలేమిటో, ఆడపిల్లలకి అంత చదువులు అవసరమా. అక్క అప్పుడ్ప్ప్పుడూ అడుగుతూ ఉంటుంది ఒరే తమ్ముడికి ఏదైనా సాయం చేయరా అని, డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా? పోనీ మా పిల్ల బట్టలు వాడి పిల్లలకి ఇద్దామా అంటే వాడికి ఆడపిల్లలుఅదృష్టహీనున్ని ఎవరు మార్చగలరు.
***
ఆలోచనల్లో మా ఊరు వచ్చేసింది. ఆ ఊరు ఏమి మారలేదు. ఊరికి ఏమైనా చెయ్యరా అనేది అక్క. ఊర్లోకి వెళ్తూనే కారు మీదున్న బల్బు ఆన్ చెయ్యమన్నాను.సైరన్ కొడుతూ అధికారికంగా వెళ్ళే కారు మా అక్క హోదాని పెంచుతుంది కదా, ప్రసాద్ ఎదురొచ్చి తీసుకెళ్ళాడు, నేను నేరుగా అక్క గదికెళ్ళాను వీళ్ళతో ఎక్కువగా మాటాడను ఎందుకంటే కోరికల చిట్టా విప్పుతారని భయం నాకు.నన్ను చూసి అక్క లేచి కుర్చోబోయింది, వెళ్లి అక్క పక్కనే కూర్చుని "అక్కా ఏంటి ఇలా అయిపోయావ్"అన్నాను. అక్క నీరసంగా నవ్వి ఎల్లకాలం ఒకేలా ఉండటానికి నేనేమన్నా గుళ్ళో విగ్రహాన్నా ఏమిట్రా అన్నది.
ప్రసాద్ ఎందుకో అక్కడే తచ్చట్లాడుతున్నాడు. ఏదో గూడుపుటానీ చేయాలని చూస్తున్నాడు."ఒర్ నువ్వెళ్ళు నేను పిలిచేదాకా రాక " అన్నది అక్క. వాడి మొఖంలో బాదో,కోపమో అర్ధం కాలేదు. నాకెందుకో అనీజీగా ఉంది వీడు ఏమైనా స్కీం వేసి ఉంటాడా? చూద్దాం అక్క చెప్తుంది కదా అనుకున్నా.
ఒరే రాజా " అక్క ప్రేమగా పిలిచి మొదలెట్టింది
"నేను ఎంతో కాలం బ్రతకనురా ప్రసాద్ కి కుటుంబం మోయలేనంత బరువయ్యింది, పిల్లల చదువుల కోసం అప్పులపాలయ్యాడు. అంతా అలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చానురా " అన్నది.
నా గుండె గుబ,గుబ లాడింది. నన్నేదో సాయం అడగటానికే నిర్ణయం తీసుకున్నట్లుంది. ప్రసాదు ఈ విషయం తెలిసీ ఏమి తెలీనట్లు నాటకం ఆడుతున్నాడు.ఛీ..డబ్బుకోసం ఎంతకైనా తెగిస్తాడు.
"అందుకే నువ్వు నా పేరున పెట్టిన ఆసిలో సగం ప్రసాద్ పేరున రాద్దాం అనుకున్నా" అన్నది.
నా నెత్తిమీద పిడుగు పడ్డట్లు అయింది.
"నువ్వు మంచిదానివని నిన్ను నమ్మితే ఇదా నివ్వు చేసేది. అంటే నా కష్టార్జితం వాడికి తెరగా ఇయ్యాలా? గోతు పెంచి అరిచాను.
ప్రసాద్ లోపలి రాబోయాడు."నువ్వు బయటికిపోరా నేను పిలిచేవరకూ రావద్దన్నానా? అరిచింది దగ్గు వచ్చి ఆపకుండా దగ్గింది. ప్రసాద్ వచ్చి మందువేసి వెళ్ళాడు. వాడి మొఖం చూస్తుంటే కంపరమెత్తుతుంది.
నా పిల్లల కోసం నేను తినకుండా దాచిపెట్టిన డబ్బుని నోట కరచుక పోవడానికి వచ్చిన తోడేలుల ఉన్నాడు. కోపం పట్టలేక ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళాను. సరళ, ఆడ పిల్లలు ఇద్దరు ఒక పక్కగా నిల్చొని ఉన్నారు. వాళ వైపు చూడ బుద్ధి కాలేదు.
ఇప్పుడు ఎం చయాలి?పోనీ ఒక లక్షో రెండు లక్షలో ఇచ్చి డీల్ చేసుకుంటే?;
ఆలోచించగా అదే కరక్ట్ అనిపించింది, అక్కా ఎక్కువ కాలం ఉండదు, తర్వాత ప్రసాద్ మోసం నుండి బైట పడవచ్చు.
ఒక నిర్ణయానికి వచ్చాక లోపలివెళ్లాను. కాని అప్పటికే అక్క పరిస్థితి దారుణంగా ఉంది. డాక్టర్ వచ్చేలోగా అక్క ప్రాణం పోయింది. ఒకందుకు బాద కలిగినా మరొకందుకు ఆనందం కలిగింది లేకుంటే ప్రసాద్ మోసం చేసేవాడు. నా దగ్గర అక్క రాసిన వీలునామా ఉన్నందువలన ఇప్పుడు నా ఆస్తికి ఎటువంటి నష్టం వాటిల్లదు.
అంతలో ఊరి ప్రసిడెంట్ వచ్చాడు మీ అక్కగారు మీకు తమ్ముడికీ ఆస్తి చేరి సగం రాసారు అన్నాడు. ఆ మాట చెర్నాకోలతో కొట్టినట్లు అయ్యింది నాకు. ఎలాగో గొంతు పెగల్చుకొని "అదెలా కుదురుతుంది అన్నాను. అదంతా నా సంపాదన కదా అన్నాను. నిజమే డాక్యుమెంట్ల ప్రకారం ఎలా చెల్లుతుందో మీకు చెప్పేవారమా మేము అన్నాడు. నా కళ్ళు బైర్లు కమ్మాయి. అక్క శవం దగ్గర ఏడుస్తున్న ప్రసాద్ ని చూస్తే దుమ్మలగుండి గుర్తుకొచ్చింది.
"ప్రసిడెంట్ గారూ ఆ కాగితం చించి వేయండి, అక్క అది రాసినట్లు నాకు తెలీదు" అన్నాడు ప్రసాద్. నా చెవులు నేనే నమ్మలేక పోయాను , బహుసా దీనిలో ఏదైనా మోసం ఉందేమో అనుకున్నాను.
అదెలా కుదురుతుంది మాస్టారూ, ఇది లీగల్ పేపరు దీని మీద సాక్షి సంతకాలుంటాయి. సాక్షుల దగ్గర కాపీలుంటాయి" అన్నాడు ప్రసిడెంట్.
ఒక్క క్షణం ఏమీ తోచనట్లు ముఖం పెట్టి నుల్చున్నాడు.
ఏమి నటన మనసులోనే తిట్టుకున్నాను. బహిరంగంగా తిట్టాలంటే నా స్తాయి గుర్తొచ్చింది.
అంతలోనే ఏదో గుర్తొచ్చి వాడి మొఖం తెరిపిన పడింది.
"సరే నేను అక్క రాసిన ఆస్తి అన్నయ్య పేరున రాస్తాను మీరు సాక్షి సంతకాలు చేయండి " అని సరళను పేపర్ తెమ్మన్నాడు.
సరళ కుంటుకుంటూ వెళ్లి పేపర్ తెచ్చింది వాడి కూతుళ్ళు పాడ్ , పెన్ను కూడా తెచ్చి ఇచ్చారు. అస్సలు వాదికేమైనా మతి పోయిందా? వాడి పెళ్ళాం బిడ్డలకైనా బుడ్డి ఉండాలి కదా లేక ఇదో కొత్త డ్రామా?
గబా గబా వాడి పేరు మీదున్న ఆస్తి నా మెడ రాసి సంతకంపెట్టి ఇచ్చాడు వారిని సాక్షి సంతకాలు పెట్టమని. మరోమారు ఆలోచిన్చామన్నా వినకుండా.
ఎందుకిలా చేసాడో ఏమో, పాపబీతి కలిగిందా లేకపోతే పది మందీ తిట్టిపోస్తారానా?
ఇంతక ముందు అనుకున్నట్లు రెండు లక్షలు ఇద్దామని చెక్ బుక్ తీశాను కానీ నా లోభ బుద్దికి ఒక లక్ష చాల్లే అనిపింఛి చక్ రాసి అమ్మాయి పెళ్ళికి ఉన్చంమ అని సరళకి ఇవ్వబోయాను."వద్దండీ బావగారూ అంటూ నవ్వుతూ తిరస్కరించింది. మీరు అక్కా వచ్చి ఆశీర్వదిస్తే చాలు. కర్చు ఎంత తక్కువ పెడితే అంత మంచిది అంటారు మీ తమ్ముడు అన్నది.
మెత్తటి చెప్పుతో చెంప చెల్లుమనిపించినట్లు అనిపించింది నాకు.
ఆస్తిని తృణ ప్రాయంగా వదిలేయతమే కాక నన్ను అవమానిన్చాలనీ చూడలేదు.
***
నాకు వాళ్ళంతా మహోన్నతుల్లా, అసలైన మనుషుల్లా నేనేమో చిన్న పిపీలకంలా అయిపోయినట్లు అనిపించింది. బిక్క చచిపోయి ఆ చ్క్ని జేబులో కుక్కుకొని నేను రాయదల్చుకున్నది పేపర్ మీద రాసి ఆస్థి మొత్తం తమ్ముడి పేరున రాసాను అక్క ఊరికి ఏదైనా చేయమనేది. ఆ పని వాడు చేస్తాడు వాడికి అక్క మాట వేద వాక్కు. కాగితం ప్రసిడెంట్ చేతిలో పెట్టాను.
మంచం మీద కదలకుండా నిర్జీవంగా ఉన్న అక్క శరీరం దేవాలయంలో ఉన్న విగ్రహం కన్నా పవిత్రంగా అనిపించింది.. పరుగున వెళ్లి అక్క పాదాల మీదపడి గుండెలు పగిలేలా ఏడ్చాను.
ఏళ్ళ తరబడి నాలో పేరుకుపోయిన మకిలి అంతా పోయేలా కన్నీరు కారుస్తూ ధారాపాతంగా ఏడ్చాను.
( మే 2-2012 "నవ్య " వార పత్రిక లో ప్రచురితం )
Thursday, August 16, 2012
Tuesday, June 28, 2011
మాతృన్యాయం
వీల్ చైర్‍లో కూర్చుని ఉన్న దుర్గాంబను విట్‍నెస్ బాక్సులో ప్రవేశపెట్టడానికి న్యాయమూర్తి అనుజ్ఞ నిచ్చారు. ఆ కేసులో ఆమె చివరి సాక్షి. అంతవరకు విచారించిన సాక్షులంతా ఒక ఎత్తు, ఈ సాక్షి మాత్రమే ఒక ఎత్తు. రాష్ట్రంలో కొత్తగా అమలులోనికి వచ్చిన చట్టం కింద విచారణకు స్వీకరించిన మొట్టమొదటి కేసుగా అప్పటికే ఆ కేసుపై అన్ని టివీ ఛానెళ్ళు తలో కెమేరా ’కన్ను’ వేశాయి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దయతో చూడని సంతానాన్ని కోర్టుకీడ్చగల శక్తి ఉన్న ఆ కొత్త చట్టం కింద రాష్ట్రంలో నమోదయిన మొట్టమొదటి కేసు అది. కోర్టుహాల్‍లో ఆమె భర్త అనంతపద్మనాభం, ఆమె ఒక్కగానొక్క కొడుకు సాయికిరణ్, కోడలు దివ్య కూర్చుని ఉన్నారు. ఆమె ముద్దుల మనుమడు, తేజ స్కూల్‍కి వెళ్ళిపోయాడు. ఒక పక్కగా ఇంటి పనిమనిషి కరుణ ఉంది. క్లర్క్ అందించిన కేసు పేపర్లు సులోచనాల లోనుంచి సునిశితంగా చూస్తూ కళ్ళు పై కెత్తి దుర్గాంబను చూశారు, న్యాయమూర్తి సుధాకర్‍రెడ్డి. ’క్రిమినల్ నెగ్లిజెన్స్’ అనే భావం ఆయన మనసులో మెదిలింది, ఆ తల్లిని చూడగానే. చెప్పలేని వేదన ఆమె మొఖంలో గూడు కట్టుకుని ఉంది. శుభ్రమైన వస్త్రాలు ధరించి ఉన్నా ఏదో లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది ఆమెను చూసినవారికి. "ప్రొసీడ్" అన్నారు న్యాయమూర్తి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాఘవరావును చూస్తూ. రాఘవరావు చాలా ఎఫిషియంట్ అడ్వకేట్‍గా పేరు తెచ్చుకున్నాడు. పదునైన వాగ్దాటితో ముద్దాయిలను ముప్పు తిప్పలు పెట్టి న్యాయం తన వైపే ఉందని న్యాయమూర్తులను ఒప్పించి, కఠినమైన శిక్షలను పడేలా చేస్తాడని, అతనంటే నేర ప్రపంచంలో టెర్రర్. అంతేకాదు, రాఘవరావు సాయికిరణ్‍కి పొరుగునే ఉన్నాడు. అందువలన ఆ వృద్ధదంపతులు తమ కొడుకు ఇంట, కోడలి చేత పడుతున్న పాట్లు ఆయనకు బాగా తెలుసు. సామాజిక స్పృహతో చైతన్యవంతమైన న్యాయవవస్థ ద్వారా కావలిసిన దానికన్నా ఎక్కువే పబ్లిసిటీ పొందుతున్నాడు, తన ప్రవృత్తి, తన వృత్తికి సహకరిస్తుండటంతో. రాఘవరావు తన పేపర్లు తీసుకుని లేచి నిల్చుని ధర్మాసనానికి అభివాదం చేసి "మిలార్డ్ ముద్దాయి సాయికిరణ్ తల్లి గారైన దుర్గాంబను ప్రశ్నించటానికి అనుమతి కోరుతున్నాను" అన్నాడు. తల పంకించి తన ఆమోదాన్ని సూచించారు న్యాయమూర్తి. వీల్ చైర్‍లోనే కూర్చుని ఉన్న దుర్గాంబను కోర్టు గుమస్తా భగవద్గీత పై ప్రమాణం చేయించాడు. ఫ్రాథమిక ప్రశ్నల తర్వాత సూటిగా విషయంలోకి వచ్చాడు రాఘవరావు. "అమ్మా! మీ భర్త తన కుమారుడైన సాయికిరణ్ మీ ఇద్దర్ని సరిగా చూడకపోవటమే కాక, శారీరిక, మానసిక ఇబ్బందులు కలుగ చేస్తున్నాడని కోర్టువారికి ఫిర్యాదు చేసిన విషయం మీకు తెలుసా?" అడిగాడు. "తెలుసు" నూతిలోనుంచి వచ్చినట్లు ఉంది ఆమె గొంతు. సాయికిరణ్ కి వ్యతిరేకంగా కేసుని బలంగా ప్రెజెంట్ చేస్తున్నాడు రాఘవరావు. దానిలో భాగంగా ఆ వృద్ధదంపతులు కొడుకు పైనే ఆధారపడి ఉన్నారని, వారికి వేరే ఆధారం లేదు అని నిరూపించాలని ప్రయత్నిస్తున్నాడు. "మీ వారు ఏం చేస్తారు?" అడిగాడు. "ఆయన టీచర్‍గా పనిచేసి రిటైర్ అయ్యారు" చెప్పింది. "మీ ఆస్తిపాస్తులు వివరాలు చెప్పండి?" "మా ఊరిలో ఒక పెంకుటిల్లు ఉంది" చెప్పింది దుర్గాంబ. "అది పాడు పడిపోయిందని, అందులో ఎవరూ ఉండటంలేదని, దాని వలన ఏ ఆదాయము లేదని మీ వారు చెప్పారు. మీరు ..." అర్థోక్తిలో ఆపాడు. "అవును,ఏ ఆదాయము లేదు" బదులిచ్చింది దుర్గాంబ. "మీరు ఎక్కడ ఉంటారు ?" సూటిగా అడిగాడు. "మా అబ్బాయి సాయికిరణ్ దగ్గర." "మీకు అప్పులు ఉన్నాయా?" "అవి ఆయన రిటైర్‍మెంట్ అయ్యాక వచ్చిన డబ్బుతో తీర్చేశాం" "మీకు రెండెకరాల పొలం ఉండేదట. ఇప్పుడు ఉందా?" "లేదు. అమ్మేశారు." "ఎందుకోసం?" "ఖర్చులు ఎక్కువవటం వలన" "ఆ ఖర్చులు మీ అబ్బాయి చదువుకోసం పెట్టినవేనా?" "అ..వు..ను." ప్రశ్నలు ఏ దిక్కుకు దారి తీస్తున్నాయో తలుచుకుని ఆమె గుండె గుబగుబలాడింది. ఒకసారి కొడుకు వైపు చూసింది. తలఒంచుకుని తన చేతివేళ్ళ గోళ్ళను పరిశీలనగా చూస్తున్నాడు అతను. భర్త వైపు చూసింది. అనంత పద్మనాభం కళ్ళజోడులోచి చుర చుర కాల్చేసే లాంటి చూపు తనకు తగిలి చటుక్కున తల ఒంచుకుంది మళ్ళీ. "ప్లీజ్ నోట్‍దిస్ పాయింట్, యువరానర్", డ్రమటిక్‍గా అన్నాడు రాఘవరావు. "ఉన్న ఆస్తులు అమ్ముకుని, అప్పులపాలై తమ ఒక్కగానొక్క కొడుకుకి బంగారు భవిష్యత్ ఉండాలని తపించిన తల్లిదండ్రులు వీరు. శరీరంలో శక్తి ఉన్నంతవరకు తమ కొడుకు అభివృద్ది కోసం నిరంతరం శ్రమించి రెక్కలు ముక్కలు చేసుకున్నారు. చివరికి రిటైర్‍మెంట్ తర్వాత వచ్చే డబ్బులతోనైనా ఒక ఆధారం ఏర్పరుచుకోకుండా తమ కొడుకి చదువు సంధ్యల కోసం చేసిన అప్పులు తీర్చడానికి వినియోగించి, తనయుడే తప్ప వేరే ఆధారం లేక మిగిలిపోయారు." "కని పెంచి తననింతవాడిని చేసిన తల్లిదండ్రుల పై దయలేని పుత్రులను పుట్టలోని చెదలతో పోల్చాడు వేమన. ఈ నాటి వరకు ఎందరో తల్లిదండ్రులు ఇలాంటి ’పుత్రరత్నాల’ నిర్లక్ష్యానికి బలయిపోయారు, పోతున్నారు కూడ. నేటికైనా చట్టం అటువంటి అభాగ్యులను ఆదుకోవడనికి నడుం కట్టడం న్యాయవ్యవస్థకే గర్వకారణం." "ఇప్పటివరకు జరిగిన విచారణలో ముద్దాయి సాయికిరణ్, అతని భార్య దివ్య ఈ వృద్ధ దంపతులపై చూపిన నిర్లక్ష్యం, అంతకు మించి వారు పెట్టిన క్షోభ కోర్టువారి దృష్టికి తీసుకువచ్చాను." "ఇవన్నీ పరిశిలించి, ఇటువంటి ’పుత్రరత్నాల’కు గుణపాఠం కలిగేలా ముద్దాయిని కఠినంగా శిక్షిస్తారని ఆశిస్తున్నాను", ఒకసారి కోర్టు హాలునంతా తన చూపులతో చుట్టి, సుదీర్ఘ ఉపన్యాసం ముగిస్తూ, న్యాయమూర్తికి అభివాదం చేసి కూర్చున్నాడు రాఘవరావు. డిఫెన్స్ లాయర్ ప్రవీణ్ లేచి నిల్చున్నాడు. కేసులో న్యాయం తమవైపు లేదనే విషయం మనసులో మెదులుతూ ఉంటే, డిఫెన్డ్ చేయలేని కేసు తీసుకున్న లాయర్‍లు ఎలా ఉంటారో అలానే ఉన్నాడు ప్రవీణ్. తన చేతిలో ఏమి లేదు. కేసు అప్పటికే ఒక ముగింపుకి వచ్చేసింది. నిరుత్సాహంగా ముందుకు నడిచి రొటీన్‍గా తను చేయవలసిన పనులు చేయడానికి, బలిపీఠం దగ్గరకు స్వయంగా వెళ్తున్న మేకపిల్లలా, వెళ్ళాడు. న్యాయమూర్తికి అభివాదం చేసి లలితమ్మను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి ఉపక్రమించాడు ప్రవీణ్. "మిమ్మల్ని మీ కొడుకు కోడలు బాగా చూసుకుంటారా?" "బాగా చూసుకుంటారు." ఈ జవాబు వినగానే ప్రవీణ్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు. అతను ఊహించినదానికి భిన్నంగా సమాధానం రావటంతో కేసు గెలవవచ్చునేమొ అని ఆశ కలిగింది. తనకు లభించిన కొద్దిపాటి అడ్వాంటేజిని పూర్తి స్తాయి చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. "అంటే మీరు మీ కొడుకు ఇంట్లో సంతోషంగానే ఉంటున్నారు కదా!" అన్నాడు. దుర్గాంబ నోరు తెరిచే లోపే రాఘవరావు స్ప్రింగ్‍లా లేచాడు. "అబ్జెక్షన్ యువరానర్! కుశలప్రశ్నల రూపంలో సాక్షిని తప్పు దోవ పట్టిస్తున్నారు", అన్నాడు. "అబ్జెక్షన్ ఓవర్‍రూల్డ్" కూల్‍గా చెబ్తూ," డిఫెన్స్ వారు ఏం చెప్పదల్చుకున్నారో, ఆ విషయం వినండి" అన్నారు న్యాయమూర్తి సుధాకర్‍రెడ్డి. రాఘవరావు అంత వేగంగా స్పందిస్తాడని ఊహించక ఖంగు తిన్న ప్రవీణ్ న్యాయమూర్తి ఇచ్చిన ప్రోత్సాహంతో తెప్పరిల్లాడు. "సెప్టెంబర్ 26న మీ ఇంట్లో జరిగిన సంఘటనను కొంచెం వివరించండి" అన్నాడు ప్రవీణ్. రాఘవరావు గుంభనంగా నవ్వుకున్నాడు. తను ప్రవీణ్‍ని డిస్టర్బ్ చేయగలిగాడు. అందుకే అతను తన ప్రశ్నకు జవాబు ఆశించకుండా మరో ప్రశ్న వేశాడు. ఈ కేసు చాలా ముఖ్యమైనది. అందునా మీడియా "కళ్ళు" తమ వైపే ఉంటాయి. కావలిసిన దానికన్నా ఎక్కువ లైమ్ లైట్. రాఘవరావు చాలా కాన్ఫిడెంట్‍గా ఉన్నాడు, కేసులో విజయం సాధించాక ప్రెస్‍మీట్ లో ఏం మాట్లాడాలో ఊహించుకుంటూ. ప్రవీణ్ అడిగిన ప్రశ్న దుర్గాంబ జ్ఞాపకాల దొంతరను కదిలించింది. కొడుకు ఇంట్లో ఉంటున్నారన్న మాటేగాని కోడలు నిరంతరం సూటిపోటి మాటలంటుంటే పడుతు జైలులో ఉన్నట్లు రోజులు దుర్భరంగా గడుస్తుండేవి. రిటైర్ అయిపోయి విశ్రాంతిగా ఇంటి పట్టున ఉంటూ ’రామా, కృష్ణా’ అనుకుంటూ ఉండాల్సిన అనంత పద్మనాభం బయటి పనులు చేసిపెట్టే పనివాడుగా మారాల్సి వచ్చింది. భర్తకు ఆ వయసులో తోడుగా ఉంటూ, ఇంట్లో పెద్ద దిక్కుగా నిలబడి సమయానుకూలంగా తగు సలహాలిస్తూ ఇంటి విషయాలు నడపవలిసిన దుర్గాంబ వంటపని చేసే వంటగత్తె అయింది. అంతేగాక పనిమనిషి రాని రోజులలో అన్ని పనులు తానే చేస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటూ కాలం గడపాల్సివచ్చింది. మనుమడిని ఆడించుకుంటూ వాడికి కథలు కబుర్లు చెబ్తూ మన వారసత్వ సంపదైన అపురూపమైన సంస్కృతి జ్ఞానాన్ని పంచి ఇవ్వాలనుకున్న అనంత పద్మనాభం మనుమడికి పనులు చేసి పెట్టే పనివాడయ్యాడు. వాడికి స్నానం చేయించడం, స్కూల్ యూనిఫాం వేసి, షూస్ పాలిష్ చేసి వాడికి తొడిగి, వాడిని సైకిల్ పై స్కూల్ దగ్గర దించి, వాడికి క్యారేజి తీసుకువెళ్ళి తినిపించి మళ్ళీ సాయంత్రం వాడిని స్కూలు నుంచి తీసుకురావటం అంతా ఆయన భాధ్యతే మరి. ఏ పనైనా గతిలేక చేస్తే మనసుకి అలసటగానే ఉంటుంది కదా! సెప్టెంబర్ 26, తేజ పుట్టిన రోజు. ఆ రోజు సంఘటనలను జీవితంలో మరచిపోలేదు, దుర్గాంబ. అప్పటికి మూడురోజుల నుంచి ఆమెకు బాగుండలేదు. పనిమనిషి కరుణ తన తల్లి ఒంట్లో బాగోలేదని ఆమెకు సేవలు చేయడానికి అదే ఊరిలో ఉన్న పుట్టింటికి వెళ్ళటంతో అన్ని పనులు దుర్గాంబపైనే పడ్డాయి. అనంత పద్మనాభంకి భార్యంటే ఎంతో ప్రేమ. చాలాసార్లు ఆయన భార్యను తీసుకుని స్వంత ఊరికి వెళ్ళిపోదామనుకున్నాడు. తమ మందులు కొనడానికే ఎంతో ఖర్చవుతుండటంతో చాలీచాలని పెన్షన్ తో బ్రతుకు భారమై ఇష్టం లేకపోయినా, కష్టమనిపిస్తున్నా అభిమానం చంపుకుని కొడుకు ఇంట్లో కాలం వెళ్ళదీస్తున్నాడు. ఆరోగ్యం బాగాలేని భార్యపై ఇంటి పనంతా వేస్తున్న కోడలిని చూస్తే అరికాలి మంట నెత్తికెక్కుతుంది ఆయనకు. ఆ రోజు తేజ స్కూల్‍కి బయల్దేరేముందు దివ్య చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాడి కోసమని గులాబ్‍జామూన్లు, పాయసం చేయించింది. తనే కొడుక్కి కొత్త బట్తలు తొడిగి స్వీట్స్ పెట్టింది. స్కూల్‍లో పంచడానికి చాక్లెట్లు డబ్బాలో వేసి ఇచ్చింది. ఇదంతా అయ్యేటప్పటికి స్కూల్‍కి లేటయింది. తాతగారితో సైకిల్‍పై బయల్దేరేటప్పుడు లేటయిపోయిందని తొందర పెట్టింది. తర్వాత ఒక గంటకి దెబ్బలు తగిలిన తేజతో ఆటోలో ఇంటికి వచ్చాడు బాగా ఏడుస్తూ వచ్చాడు తేజ. వాడి కొత్త బట్టలు మట్టికొట్టుకుని ఉన్నాయి. అనంతపద్మనాభంకి కూడా దెబ్బలు తగిలాయి, అతని కళ్ళజోడు విరిగిపోయింది. తేజ అవతారం చూసి దివ్య తోక తొక్కిన తాచులా లేచింది. ఆటో వాడున్నా కూడా పట్టించుకోకుండా మామగారిని చెడామడా తిట్టేసింది. ఆయన చెప్పే మాటలు వినిపించుకోలేదు. చివరకు ఆటో వాడు కలుగచేసుకుని "మేడమ్, పెద్దసారు తప్పులేదు. నేనే ఆటో సడన్‍గా తింపిన, సైకిల్ తగిలి ఏక్సిడెంట్ అయింది. సైకిల్ నేను రిపేరు కిచ్చిన. వీళ్ళను తోడుకుని ఇంటి దగ్గర దింపి వెళ్దమని వచ్చిన. పెద్ద సారుని తిట్టకమ్మ, మంచిది కాదు" అని చెప్పి వెళ్ళిపోయాడు. కొడుకు దెబ్బలకు మందు రాస్తూ ధారాపాతంగా అత్త, మామలపై తిట్ల వర్షం కురిపిస్తూనె ఉంది దివ్య. అనంత పద్మనాభం దెబ్బలకు రాయటానికి కాస్త మందు తీసుకోబోయిన దుర్గాంబను ఒక్క తోపు తోసింది. దానితో ఆమె బాలెన్స్ తప్పి గోడపైన పడింది. విసురుగా తగలటంతో తలచిట్లి రక్తం కారుతూ సొమ్మసిల్లిపడిపోయింది. ఆ తర్వాత దుర్గాంబ కళ్ళు తెరిచేసరికి హాస్పటల్‍లో ఉంది. అనంత పద్మనాభం పక్కనే కూర్చుని ఉన్నాడు. ఎంతో ఆందోళన పడుతున్న భర్తను చూసి చాలా బాధ పడింది తను. జరిగినదేదో జరిగి పోయింది, ఇక అన్ని విషయాలు మరిచిపోయి మామూలుగా ఉండాలనే అనుకుంది తను. కాని ఇదిగో ఇలా జరిగింది. ఇప్పుడు ప్రవీణ్ కోర్టులో అడుగుతుంటే ఒక్కసారిగా అన్నిజ్ఞాపకాలు ఆమెను చుట్టుముట్టాయి. "ఆ రోజు మా మనుమడి పుట్టినరోజు. స్కూల్‍కి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఆటోకి తగిలి సైకిల్ నుండి పడిపోయాడు. తేజకు దెబ్బలు తగిలాయి. ఇంటికి వచ్చాక వాడిని చూసి అంతా బాధపడ్డాం " అని మాత్రం చెప్పింది. "మీ కోడలు దివ్య మీ పై చేయి చేసుకుందని, మీ అబ్బాయి అక్కడే ఉన్నా వారించలేదని, మీ భర్త చెప్పారు. మీరేమంటారు?" అసలు విషయం దగ్గరకు వచ్చేసరికి అంతవరకు తెచ్చి పెట్టుకున్న గాంభీర్యం పోయి దాని స్థానాన్ని బేలతనం ఆక్రమించుకుంది ప్రవీణ్లో. దుర్గాంబకు కూడా పరిస్థితి అర్థమయింది. ఇప్పుడు తను చెప్పబోయే మాటలపైన ఒక పక్క తన భర్త పరువు, మరొక పక్క తన కొడుకి పరువు ఆధారపడి ఉన్నాయని ఆమెకు తెలుసు. ఒక్క పరువే కాదు, భర్త విషయంలో ఆయనతో తన అనుబంధం, అనురాగం, తనపై ఆయన చూపించే ప్రేమాభిమానాలు, మరొకవంక కొడుకు విషయంలో శిక్ష పడి అవమానపడతాడన్న బాధ ఆమెను ఎటూ తేల్చుకోనివ్వటంలేదు. "అయ్యా నేను ఓ నాలుగు మాటలు చెప్పవచ్చా?" న్యాయమూర్తి వైపు తిరిగి అభ్యర్ధనగా అడిగింది దుర్గాంబ. న్యాయమూర్తి సాలోచనగా ప్రవీణ్ వైపు చూసి, అతనికి అభ్యంతరం ఉండదని గ్రహించి దుర్గాంబతో " చెప్పండి" అన్నారు. "తప్పు చేసిన వారిని దండించి చక్కదిద్దడానికేగా రాజ్యాంగం న్యాయస్థానాలను ఏర్పరచడం. కొత్త కొత్త చట్టాలను చేసేటప్పుడు మీ లాంటి పెద్దలు అంతా ఆలోచించే చేస్తారు. కాని సమాజంలో జరిగే తప్పుకు సమాజం భాధ్యత ఉండదా?" మాటలు కూడబెట్టుకుంటూ ఆలోచనలను ఒక తాటిపైకి తేవటం కోసం ఒక క్షణం ఆగింది దుర్గాంబ. న్యాయమూర్తి ఆమె వైపు ఒకింత ఆశ్చర్యంగా చూశారు. కోర్టుహాలులో అంతా ఆమె ఏం చెబ్తుందో అని శ్రద్ధగా వినసాగారు. కాస్త స్వగతంగా, కాస్త ప్రసంగంగా తన ధోరణిలో మళ్ళీ మాట్లాడటం ప్రారంభించింది దుర్గాంబ. "పిల్లలను బాగా చదవమని ఒత్తిడి చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి వాళ్ళలో కాంపిటీషన్ పెంచి ’ఎక్కువ మార్కుల ’ చదువే ప్రోత్సహిస్తున్నాం. ఈ రోజుల్లో చదువు నేర్పడం తప్పితే సంస్కారం నేర్పే బడులున్నాయా? మాస్టార్లున్నారా?" "ఆ పిల్లలే పెరిగి పెద్దయ్యాక సమాజంలో సరిగా బ్రతక లేకపోతే దానికి సమాజం, అందులోనే ఉన్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేధావులు, ప్రభుత్వాలు, భాధ్యత తీసుకోరా?" అడిగింది దుర్గాంబ. "అంటే ఈ చట్టం వలన ఉపయోగం లేదంటారా?" తన ఎదురుగా మాట్లాడుతున్న మహిళ విద్యావంతురాలు అన్న స్పృహ క్షణక్షణం బలపడుతుండటంతో ఆమె అభిప్రాయం విలువైనదన్నట్లు అడిగారు న్యాయమూర్తి. "చట్టానికి ఉపయోగం ఉందా లేదా అనేదానికంటే చట్టం ద్వారా ఎంత మార్పు వస్తుంది అనేది కూడ ముఖ్యం కదా? ’దట్ గవర్న్మెంట్ ఈస్ ద బెస్ట్ విచ్ గవర్న్స్ ద లీస్ట్’ అన్నారు రాజనీతిజ్ఞులు. స్వయంపాలనను సమర్ధిస్తూ ఎందరో ఉద్యమాలు కూడ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం మరి ’గృహపాలన’ లో జోక్యం చేసుకోవటం అంత అవసరమా?" "మా ఇంట్లోని పనిమనిషి కరుణను చూడండి. ఆమె చదువుకోలేదు. అయినా తల్లికి ఒంట్లో బాగోలేదంటే తన పని మానుకుని ఆమెకు సేవ చేయటానికి వెళ్ళింది". "అదే తమ తల్లిదండ్రులను హాస్పటలికి తీసుకెళ్ళాలంటే శలవు పెట్టి ఎంత మంది పిల్లలు వెళ్తున్నారు? చదువుకుంటే సెంటిమెంట్స్ చచ్చిపోతాయా?" "మన పిల్లల పెంపకంలో పెద్దవాళ్ళపై ప్రేమ, ఆప్యాయతలు ఎంతవరకు కలిగిస్తున్నాము. ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడో పోయాయి. కనీసం తాతయ్య, మామ్మలతో కులాసాగా గడిపే బాల్యం మన పిల్లలకు ఇస్తున్నామా?" "ఇవన్నీ ’గృహపాలన’వంటివి. ఇవి సరిగా ఉంటే ఇటువంటి చట్టం చేయవలిసిన అవసరం కలుగుతుందా?" "అయినా ఇప్పటికైనా మేల్కొని మన సమాజం కుటుంబపాలనను సరిదిద్దుకుంటే ఎంత బాగుంటుంది?" దుర్గాంబ సంధిస్తున్న ప్రశ్నలు అందరి హృదయాలను సూటిగా తాకుతున్నాయి. ఎవరికి వారు తమ గురించి తామే బేరీజు వేసుకుంటూ ఆమె ఇంకా ఏమి చెప్తుందో అని వినసాగారు. కోర్టు హాలులో అందరూ చిత్తరువులు అయిపోయారు. "ప్రభుత్వం వాలంటరీ సంస్థల సహాయంతో వృద్ధాశ్రమాలు ఎందుకు పెట్టకూడదు? వాటి పాలన, అక్కడి వృద్ధులు తమకు తామె చెసుకోవచ్చు, లేదా తాము ఎన్నుకున్న వారితోనే జరిపేలా ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది!" "టివి సీరియల్స్‍లో ప్రతిరోజు ఇంటింటా ఒకరినొకరు హింసించుకొనే అత్తాకోడళ్ళు ఎందుకు ఉండాలి? తాతయ్య చెప్పే నీతి కథలు, బామ్మలు పాడే పాటలు ఎందుకు ప్రసారం చేయరు?" "ఒక తల్లి శివాజీని తయారు చేయలేదా? పిల్లలకు అన్నం తామే తినిపిస్తూ మన వారసత్వపు కథలు చెప్తే పిల్లలు మంచి వ్యక్తిత్వం పొందరా? ఈ రోజు ఇంతమంది మేధావులు, న్యాయశాస్త్ర కోవిదులు ఇక్కడ ఉన్నారు. వారి పిల్లలు రేపు పెద్దయ్యాక తమ తల్లిదండ్రులను చక్కగా గౌరవించేలా పెరుగుతున్నారా లేక పోటీ చదువులలో తలమునకలై పోయి ఆప్యాయతా, ఆత్మీయతలను తుంచుకుంటున్నారా?" "ఇంత చెప్పటం కాదు గాని మాలాంటి తల్లిదండ్రులు బొత్తిగా ఏమి తమకోసం ఉంచుకోకుండా అంతా పిల్లలకే ఇచ్చి చివరి కాలంలో వారి పైనే ఆధారపడడం కూడా ఒక విధంగా తప్పేకాదూ?" "అన్ని వయసులవారు, అన్ని వర్గాలవారు , ఆలోచించి మనముండే ఈ సమాజాన్ని మరింత ప్రేమగా, మరింత అందంగా, మరింత ఆప్యాయంగా మార్చుకునే దారులు కనుక్కోలేమా?" "ఇవన్నీ మీకు తెలియవని కాదు. కాని పెద్దదాన్ని నా మనసులోని సంఘర్షణ ఇలా మాటలలో బయటకు వచ్చింది." "ఇక మా ఇంట్లో జరిగిన విషయం ఎవరి ఇంట్లోనైనా జరిగేదే. అంతేకాని మా కోడలుగాని, కొడుకుగాని ఏదో నేరం చేయలేదు. ఏదో ఆవేశపూరితమైన వాతావరణంలో జరిగిన కాకతాళీయ సంఘటనేగాని మరేమి కాదు." "ఎవరి మనసైనా నొప్పిస్తే మన్నించండి" కళ్ళనీళ్ళు కుక్కుకుంటూ భర్త వైపు చూసింది దుర్గాంబ. ఆమె మాటలు శ్రద్ధగా విన్న అనంత పద్మనాభం కొంచెం ప్రసన్నంగా కనిపించాడు. ఆయన కూడ తన ఆవేశాన్ని నిందించుకుని పరితపించాడు. న్యాయమూర్తి తో సహా కోర్టుహాలు లోని అందరూ నోటమాట లేక నిరుత్తరులయి పోయారు. కొంచెం తేరుకుని న్యాయమూర్తి తన తీర్పు చెప్పారు. "సాక్ష్యాధారాలను పరిశీలించాక మా ముందున్న ఫిర్యాదు లోని సంఘటనలు ఉద్దేశపూరితంగా జరిగినవి కావని కోర్టు విశ్వసిస్తుంది. అయినా సాయికిరణ్, దివ్యలు తమ పెద్దలను మరింత ఆదరంగా చూసుకోవలిసిన అవసరం ఉంది. జరిగిన సంఘటనపై వారు భాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు వారిని మందలిస్తూ, ఇకపై ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలని ఆదేశిస్తున్నాము. సాయికిరణ్ తన తల్లిదండ్రులతో సహా వారికి ఇష్టమైన యాత్ర చేసి కోర్టువారికి తగిన ఆధారాలు ఒక నెలలోగా చూపాలని కూడా ఆదేశిస్తున్నాము." కోర్టుహాలులో, రాఘవరావుతో సహా , అందరూ ఆ తీర్పు విని హర్షధ్వానాలు చేసారు. దివ్య, సాయికిరణ్ వచ్చి దుర్గాంబ పాదాలు తాకారు. అనంత పద్మనాభం దుర్గాంబ తలనిమిరాడు. కొడుకు, కోడలు పరివర్తన చెందారని వృద్ధ దంపతులు సంతోషించారు. * * *
(ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 12-11-2009 సంచికలో ప్రచురితం)
Subscribe to:
Comments (Atom)














